మాక్స్ డెల్‌బ్రక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాక్స్ డెల్‌బ్రక్

మాక్స్‌ డెల్‌బ్రక్ (1906 సెప్టెంబరు 4 - 1981 మార్చి 9) మాలిక్యులర్‌ బయాలజీకి మార్గదర్శకుడు.[1] 'బ్యాక్టీరియో ఫేజ్‌' (Bacterio Phase) అనే నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించి 1969లో వైద్యశాస్త్రంలో నోబెల్‌ అందుకున్నాడు[2].

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

జర్మనీలోని బెర్లిన్‌లో 1906 సెప్టెంబరు 4న విద్యావంతుల కుటుంబంలో పుట్టిన మాక్స్‌ డెల్‌బ్రక్‌కి చిన్నతనం నుంచే ఏదో సాధించాలనే తపన ఉండేది. తండ్రి బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌, ఓ రాజకీయ పత్రికకు సంపాదకుడు కావడం, తల్లి కుటుంబంలోని వారంతా వైద్యవృత్తికి చెందిన వారే కావడంతో బాగా చదువుకుని అందరి కంటే పెద్ద పేరు సాధించాలని ఉవ్విళ్లూరుతుండేవాడు. పద్దెనిమిదవ ఏట ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించిన అతడు డిగ్రీ తర్వాత 24 ఏళ్లకే పీహెచ్‌డీ సాధించాడు. ఆపై ప్రముఖ శాస్త్రవేత్తలైన నీల్స్‌బోర్‌ తదితరుల సహచర్యంలో భౌతిక శాస్త్రంలో కాంతి పరిక్షేపం, ఉష్ణగతిక శాస్త్రం, క్వాంటం సిద్ధాంతం, స్టాటిస్టిక్స్‌ మెకానిక్స్‌లో పరిశోధన పత్రాలు వెలువరించాడు.

పరిశోధనలు

[మార్చు]

సూక్ష్మజీవుల గురించి అవగాహన అంతగా లేని రోజుల్లో వాటి గురించి పరిశోధనలు చేసి సాధికారికమైన విషయాలను చాటి చెప్పిన శాస్త్రవేత్తగా మాక్స్‌ డెల్‌బ్రక్‌ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత కలిగిన 'మాలిక్యులర్‌ బయాలజీ' శాస్త్రం ఏర్పడడానికి దోహద పడిన వారిలో ముఖ్యుడైన ఈయన ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. జీవశాస్త్రంలోని జన్యువుల (Genes) ప్రవర్తనకు, భౌతికశాస్త్రంలోని అణువుల (Molecules) ప్రవర్తనకు పోలికలు ఉన్నాయంటూ నీల్స్‌బోర్‌ ఇచ్చిన ఉపన్యాసానికి ప్రభావితుడైన డెల్‌బ్రక్‌ తన పరిశోధనలను జన్యుశాస్త్రం వైపు మళ్లించాడు. అయితే నాజీలు రాజ్యమేలుతున్న అప్పటి జర్మనీలో ఇమడలేక అమెరికా వలస వెళ్లాడు. ఒక పక్క విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా భౌతిక శాస్త్రం బోధిస్తూనే, జన్యుశాస్త్రంలో పరిశోధనలు కొనసాగించడం విశేషం. అందుకు ఫలితంగానే 'బ్యాక్టీరియో ఫేజ్‌' (Bacterio Phase) అనే నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించి 1969లో వైద్యశాస్త్రంలో నోబెల్‌ అందుకున్నాడు. బ్యాక్టీరియో ఫేజ్‌ అంటే సూక్ష్మజీవులపై దాడి చేసి వాటిని నాశనం చేసే ఒక రకమైన వైరస్‌. ఒక రకంగా ఇవి జీవాణుభక్షకాలు. బ్యాక్టీరియాను భక్షిస్తూనే ఈ వైరస్‌ అధిక సంఖ్యలో పునరుత్పత్తి చెందడాన్ని ప్రయోగాత్మకంగా చూపించాడు. ఈ పరిశోధన వైద్య రంగంలో విప్లవాన్ని సృష్టించింది. ఆపై సంవేదన శారీరక శాస్త్రం (సెన్సరీ ఫిజియాలజీ) లో పరిశోధనలు, 'మాలిక్యులర్‌ జెనెటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌' స్థాపనల ద్వారా డెల్‌బ్రక్‌ శాస్త్రలోకానికి ఎంతో సేవ చేశారు.

మూలాలు

[మార్చు]
  1. doi:10.1098/rsbm.1982.0003
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  2. "The Nobel Prize in Physiology or Medicine 1969", Nobel Media AB 2013, Nobelprize.org, Web acces 6 Nov 2013.

ఇతర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.